: టాటా టెలీసర్వీసెస్‌ను కొనేయనున్న ఎయిర్‌టెల్.. ఇక రేసులో నిలిచేది నాలుగే!
భారత్‌లోని టెలికం రంగంలో విపరీతమైన పోటీ నెలకొంది. జియో రాకతో అది మరింత పెరిగింది. అయితే 2020 నాటికి దేశంలో మిగిలేవి నాలుగు కంపెనీలేనని లండన్‌కు చెందిన గ్లోబల్ మొబైల్, వైర్‌లెస్ మార్కెట్ ఇన్ఫర్మేషన్ ఇంటెలిజెన్స్ ప్రొవైడర్ సీసీఎస్ ఇన్‌సైట్ పేర్కొంది. దేశంలోనే అతిపెద్ద టెలికం సంస్థ అయిన భారతీ ఎయిర్‌టెల్ అతి త్వరలో టాటా టెలీసర్వీసెస్‌ను సొంతం చేసుకోబోతోందని పేర్కొని సంచలనానికి తెరలేపింది. విలీనానికి సంబంధించి చర్చలు జరుగుతున్నట్టు పేర్కొంది.
2020 నాటికి భారత టెలికం రంగంలో మూడు ప్రైవేటు ఆపరేటర్లు, ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ మాత్రమే ఉంటాయని పేర్కొంది. వొడాఫోన్, ఐడియా సెల్యులార్ మధ్య విలీన చర్చలు జరుగుతుండడంతో అది పూర్తయితే ఐడియా అతిపెద్ద ఆపరేటర్‌గా అవతరిస్తుందని భావిస్తున్న భారతీ ఎయిర్‌టెల్.. టాటా టెలీసర్వీసెస్‌ను సొంతం చేసుకునే పనిలో పడినట్టు సీసీఎస్ ఇన్‌సైట్ పేర్కొంది. 2010లో 15 లైసెన్స్‌డ్ టెలికం కంపెనీలు ఉండగా 2020 నాటికి అవి నాలుగుకు పడిపోవడం ఖాయమని నిపుణులు అంచనా వేస్తున్నట్టు సీసీఎస్ ఇన్‌సైట్ పేర్కొంది.