: శిరీష ఆత్మహత్య కేసులో మళ్లీ పాతకథే చెప్పిన పోలీసులు... కుటుంబ సభ్యులకు అనుమానాలుంటే కలవాలని సూచన!
హైదరాబాదులోని ఫిల్మ్ నగర్ లోని ఆర్జే స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష కేసులో పోలీసులు మళ్లీ పాతకథనే వినిపించారు. ప్రభాకర్ రెడ్డి దగ్గరకు శిరీషను సెటిల్మెంట్ కోసం తీసుకొస్తే... మద్యం ఎందుకు తీసుకున్నారు? తరువాత ఏం మాట్లాడారు? ప్రభాకర్ రెడ్డి వద్ద ఉద్దేశపూర్వకంగానే శిరీషను వదిలి రాజీవ్, శ్రవణ్ లు సిగరెట్ తాగేందుకు వెళ్లారా? అలా వెళ్తే వెంటనే వెనక్కి ఎందుకు వచ్చారు? అత్యాచార యత్నం చేసిన ఎస్సై ని వదిలేసి, శిరీషను ఎందుకు కొట్టాల్సి వచ్చింది? అత్యాచారయత్నం మాత్రమే జరిగితే ఆమె ఎందుకు కారు దూకి పారిపోయే ప్రయత్నం చేసింది? శిరీష, తేజస్వినిలను వదిలించుకోవాలనుకున్న రాజీవ్ ఏ విధంగా వదిలించుకోవాలనుకున్నాడు?
రెండు సార్లు ఎస్సై ప్రభాకర్ రెడ్డి వద్దకు తాను అమ్మాయిలను పంపినట్టు శ్రవణ్ పోలీసులతో చెప్పాడని తెలుస్తోంది. అలాంటప్పుడు శిరీషను ఏ ఉద్దేశంతో రాత్రి సమయంలో ఎస్సై వద్దకు తీసుకెళ్లాడు? ఎస్సై ఏం చేశాడు? వంటి వివరాలను రాబట్టామని, వాటికి సాక్ష్యాలు ఉన్నాయని చెబుతున్న పోలీసులు ఆ సాక్ష్యాలు ఇంతవరకు బయటపెట్టలేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోపక్క, ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య వెనుక ఉన్నతాధికారుల వేధింపులు ఉన్నాయని ఆయన కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. శిరీష ఆత్మహత్య కేసులో విచారణ మొత్తం తప్పుల తడకగా సాగుతోందని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం తాము నిష్పాక్షికంగా, నిజాయతీగా దర్యాప్తు చేస్తున్నామని, ఎవరికైనా అనుమానాలుంటే తమను కలిస్తే వారి అనుమానాలు తీరుస్తామని చెబుతున్నారు.