: రవితేజ సోదరుడు భరత్ పెళ్లి గురించి పోసాని.. నాటి ఇంటర్వ్యూ వైరల్!
ప్రముఖ నటుడు రవితేజ సోదరుడు భరత్ మృతి అనంతరం అతనికి సంబంధించిన చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మద్యానికి, డ్రగ్స్ కు అలవాటుపడ్డ భరత్ ను అతని కుటుంబసభ్యులు దూరంగా ఉంచడం, చివరకు, భరత్ అంత్యక్రియలకు సోదరుడు రఘు, బాబాయ్ మినహా మిగిలిన కుటుంబసభ్యులెవ్వరూ హాజరుకాకపోవడం తెలిసిందే. అయితే, ప్రముఖ మాటల రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి గతంలో ఓ ఇంటర్వ్యూలో భరత్ పెళ్లికి సంబంధించి చెప్పిన మాటలు మళ్లీ తెరపైకి వచ్చాయి.
హైదరాబాద్ లో ఓ ధనిక అమ్మాయిని భరత్ ప్రేమించాడని, వాళ్ల పెళ్లి తామే చేశామని పోసాని నాడు పేర్కొన్నారు. అయితే, పోసాని కెరీర్ ఆరంభంలో పరుచూరి బ్రదర్స్ వద్ద అసిస్టెంట్ గా పనిచేశారు. అప్పుడు, వారి ఆఫీస్ లోనే ఓ గదిలో ఆయన ఉండేవారు. ఓసారి.. ఆశ్రయం నిమిత్తం భరత్ ఆ అమ్మాయిని తీసుకుని పోసాని గదికి వెళ్లాడని, ఈ విషయమై కొంతమంది మిత్రులతో భరత్ తనకు ఫోన్ చేయించాడని, దీంతో, వాళ్లిద్దరినీ ఆ గదిలో ఉంచి, తాను వేరే చోటుకు వెళ్లానని ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న పరుచూరి బ్రదర్స్ ఇంట్లో వాళ్లు, తనను బయటకు పంపేసిన విషయాన్ని నాడు పోసాని ప్రస్తావించారు.