: ‘నాకు బట్టలు అమ్మనంటావా?’ అంటూ షాప్‌ను తగలబెట్టాడు.. భారీగా ఆస్తి నష్టం!
కొమరంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో ఓ వ్యక్తి బట్టల దుకాణాన్ని తగులబెట్టేశాడు. జులై నుంచి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా జీఎస్టీ విధానాన్ని అమలు చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమపై విధిస్తోన్న పన్ను పట్ల నిరసన తెలుపుతూ వస్త్రదుకాణాలు బంద్ అయ్యాయి. అయినప్పటికీ షాపుకి వెళ్లిన ఓ వ్యక్తి తనకు బట్టలు అమ్మాల్సిందేనని వాదించాడు. ఈ రోజు విక్రయాలు జరపడం లేదని దుకాణదారుడు అతడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.
అయితే, తనకు కావలసింది ఇస్తేనే వెళతానని ఆ వ్యక్తి అన్నాడు. దానికి దుకాణదారుడు ససేమిరా అనడంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ వ్యక్తి 'నాకు బట్టలు అమ్మనంటావా?' అంటూ కొద్దిసేపటికే దుకాణంలోకి చొరబడి పెట్రోలు పోసి దుకాణాన్ని తగలబెట్టాడు. దీంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. స్థానికులంతా కలిసి మంటలను ఆర్పేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.