: బామ్మగారి నిర్వాకానికి.. ప్రయాణికులను దింపేసి, విమానం ఇంజిన్‌ను విప్పేసి.. మరమ్మతు చేశారు!
భారతీయులు కొందరు ట్రైన్‌లో వెళుతున్నప్పుడు ఏవైనా నదులు వస్తే కిటికీలోంచి నీళ్లలోకి రూపాయి, రెండు రూపాయల నాణేలని విసిరేస్తుంటారు. అలా చేస్తే మంచిదని వారి నమ్మకం. ఇంచుమించు ఇటువంటి పనే చేసింది ఓ చైనా బామ్మ. అయితే, ఆమె నాణేలను నీళ్లలో వేయలేదు.. విమానం ఎక్కుతూ దాని ఇంజిన్‌లో వేసింది.. అలా చేస్తే మంచి జరుగుతుందని ఆ బామ్మ భావించింది. ఆమెకు మూఢనమ్మకాలు ఎక్కువగా ఉన్నాయని విచారణలో అధికారులకు తెలిసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, షాంఘై పుడోంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. చైనా విమానం 150 మంది ప్రయాణికులతో సీజెడ్ 380 గాంగ్జౌ పట్టణానికి బయల్దేరేందుకు సిద్ధంగా ఉండగా.. గాంగ్జౌకు వెళ్లేందుకు విమానం ఎక్కుతున్న 80 ఏళ్ల బామ్మ ఈ పనిచేసింది.
ఆమెతో పాటు ఆమె భర్త, కూతురు, అల్లుడు ఉన్నారు. ఆ బామ్మ నాణేలు ఇంజిన్‌లోకి పడవేయగానే ఈ విషయాన్ని గమనించిన ఓ ప్రయాణికుడు అధికారులకు సమాచారం అందించాడు. దీంతో ఆ విమానాన్ని ఆపేసి, విమానం ఇంజిన్‌ను విప్పేసి, మరమ్మతు చేశారు. దీంతో ఆ విమానం కొన్ని గంటలు ఆలస్యంగా బయల్దేరింది. ఆ పని చేసిన బామ్మతో పాటు ఆమెతో ఉన్న కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఆ బామ్మ విమాన ఇంజిన్‌లోకి తొమ్మిది నాణేలను విసిరేసిందని చెప్పారు. అలా చేస్తే తమకు ఎలాంటి హానీ జరగకుండా ఉంటుంందని ఆ బామ్మ భావించిందని అన్నారు.