: క్రికెట్ పై ప్రేమతో ఇల్లు వదిలిన బాలుడి ఆచూకీ లభ్యం
క్రికెట్ పై ప్రేమతో ఇల్లు వదిలి వెళ్లిన విశాఖ బాలుడు భువన సాయి ఆచూకీ లభించింది. రైల్లో ప్రయాణిస్తున్న భువన సాయిని ప్రయాణీకులు గుర్తించి, ఈ సమాచారాన్ని వారి తల్లిదండ్రులకు చేరవేశారు. తూర్పుగోదావరి జిల్లాలోని సామర్లకోట రైల్వేస్టేషన్ కు సమీపంలో రైలు ప్రయాణిస్తుండగా ఈ సమాచారం భువనసాయి తల్లిదండ్రులకు చేరింది. దీంతో, భువనసాయి తల్లిదండ్రులు రైల్వేస్టేషన్ కు బయలుదేరినట్టు సమాచారం.
కాగా, తాను గొప్ప క్రికెటర్ ను అయ్యేంత వరకూ ఇంటి ముఖం చూడనంటూ ఓ లేఖ రాసిపెట్టి భువనసాయి వెళ్లిపోయాడు. తన కోసం వెతకవద్దని, ఒకవేళ, పోలీసులకు ఫిర్యాదు చేస్తే తాను ఎప్పటికీ ఇంటికి రానని ఆ లేఖలో పేర్కొన్నాడు. ఇంట్లో నుంచి వెళ్లే సమయంలో తన తండ్రి జేబులో ఉన్న ఏటీఏం కార్డును, కొంత డబ్బును తీసుకువెళ్లాడు. ఈ నేపథ్యంలో బాలుడి తల్లిదండ్రులు బస్టాండ్లు, రైల్వేస్టేషన్ మొదలైన చోట్ల వెతికి, చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.