: టీమిండియా ప్రధాన కోచ్ పదవి కోసం నేను కూడా దరఖాస్తు చేస్తా: రవిశాస్త్రి

ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్‌గా అనిల్ కుంబ్లే పదవీకాలం ముగిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతున్న వెస్టిండీస్ పర్యటన ముగిసే వరకు ఆయన పదవీ కాలాన్ని పొడిగించాలని బీసీసీఐ భావించినప్పటికీ కుంబ్లే రాజీనామా చేయడంతో టీమిండియా చీఫ్ కోచ్ లేకుండానే వెస్టిండీస్‌తో ఆడుతోంది. మరోవైపు కోచ్ ఎంపిక ప్రక్రియ కోసం బీసీసీఐ మరోసారి దరఖాస్తులను ఆహ్వానించడంతో టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి తాను కూడా ప్రధాన కోచ్ పదవికి దరఖాస్తు చేయనున్నట్లు ప్రకటించారు.
గతంలో కోచ్ బాధ్యతలు అప్పగించాలనుకుంటే తనకు అప్పగించాలని, తాను మాత్రం ఇంటర్వ్యూ కోసం వరుసలో నిలబడనని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు. అయితే, ఆ వ్యాఖ్యల గురించి ఆయనను మీడియా ప్రశ్నించగా రవిశాస్త్రి ఎటువంటి సమాధానమూ ఇవ్వలేదు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. రవిశాస్త్రి వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ పదవి కోసం బీసీసీఐకి టామ్‌మూడీ, సెహ్వాగ్ దరఖాస్తు చేసుకున్నారు.