: ఈ ఎన్నికను కులపోరుగా చూస్తే, రాష్ట్రపతి పదవిని కించపరచడమే అవుతుంది: మీరాకుమార్
రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ నుంచి రామ్ నాథ్ కోవింద్, విపక్షాల తరపున మీరాకుమార్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలోకి దిగిన అనంతరం ఢిల్లీలో మీరాకుమార్ తొలిసారిగా మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రపతి ఎన్నిక అనేది కులపోరాటం కాదని, భావజాల సంగ్రామమని, కుల వ్యవస్థను ఇప్పటికైనా భూ లోతుల్లో పాతిపెట్టాలని సూచించారు. ఈ ఎన్నికను ఫలానా కులానికి చెందిన వ్యక్తుల మధ్య పోరుగా అభివర్ణించడమనేది సరికాదని, అది రాష్ట్రపతి పదవిని కించపరచడమే అవుతుందని అన్నారు. కాగా, ఈ ఎన్నికలో ఓడిపోతానని అంగీకరించేందుకు ఆమె నిరాకరించారు. తాను ఓడిపోయే అభ్యర్థినని, ఇది ఓడిపోయే పోరాటమని ఎందుకు అనుకుంటారని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ఆమె చెప్పారు. తాను పోరాడుతున్నానని, గట్టి పోటీ ఇవ్వగలనని అనుకుంటున్నానని చెప్పారు.