: అసలు ఎవరీ సయ్యద్ సలాహుద్దీన్?
కశ్మీరీ మిలిటెంట్ గ్రూప్ హిజ్బుల్ ముజాహిద్దీన్ నాయకుడు సయ్యద్ సలాహుద్దీన్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా అగ్రరాజ్యం అమెరికా ప్రకటించింది. తమ దేశ స్వాతంత్ర్య యోధుడిగా పాకిస్థాన్ పరిగణించే సలాహుద్దీన్‌ను ప్రధాని మోదీ అమెరికా వెళ్లడానికి కొన్ని గంటల ముందు అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంతో సయ్యద్ సలాహుద్దీన్ వార్తల్లో వ్యక్తిగా మారాడు. అతని జీవితానికి సంబంధించిన పూర్తి వివరాలు....
మహ్మద్ యూసుఫ్ షా అలియాస్ సయ్యద్ సలాహుద్దీన్ మధ్య కశ్మీర్‌లోని బుద్గావ్ జిల్లాకు చెందిన వ్యక్తి. గత 27 ఏళ్లుగా పాక్ ఆక్రమిత కశ్మీర్ మిలిటెంట్ కార్యకలాపాల్లో ముఖ్యపాత్ర పోషించాడు. అలాగే జమ్మూ కశ్మీర్ కేంద్రంగా పనిచేసే యునైటెడ్ జిహాద్ కౌన్సిల్‌కు కూడా సలాహుద్దీన్ నాయకుడు. ఆయుధాల సరఫరా, తీవ్రవాదంలో యువతకు శిక్షణ వంటి కార్యకలాపాలతో ఎన్ఐఏ మోస్ట్ వాంటెడ్‌గా మారాడు.
1971లో శ్రీనగర్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో సలాహుద్దీన్ మాస్టర్స్ పూర్తిచేశాడు. తర్వాత 1987లో జామత్-ఇ-ఇస్లామీ పార్టీలో చేరి రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయాడు. తర్వాత 1989లో హిజ్బుల్ ముజాహిద్దీన్ గ్రూప్‌ను స్థాపించాడు. ఆ సమయంలో భారత విదేశాంగ మంత్రిగా ఉన్న నవజ్యోత్ సర్నా, సలాహుద్దీన్ ను అరెస్టు చేసి భారత్‌కి అప్పగించాలని కోరారు. గతేడాది హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ వనీని చంపిన తర్వాత అతన్ని మృతవీరుడిగా ప్రకటించి భారత్‌పై కక్ష సాధింపు చర్యలు ప్రారంభించాడు.