: కెమెరాలను చూసి జూనియర్ ఎన్టీఆర్ షాక్!
అదేంటీ? ఒక సినిమా హీరో అయి ఉండి కెమెరాలను చూసి ఎందుకు షాకయ్యాడు అనుకుంటున్నారా? కెమెరాలు సెట్‌లో కాకుండా నట్టింట్లో పెడితే ఎంతటి హీరో అయినా షాక్ అవక తప్పదు. అసలు కెమెరాలు ఎన్టీఆర్ ఇంట్లో ఎందుకు పెట్టారో తెలియాలంటే బిగ్‌బాస్ తెలుగు ప్రోమో చూడాల్సిందే. తొలిసారి వ్యాఖ్యాతగా ఎన్టీఆర్ బుల్లితెరపై సందడి చేయనున్న బిగ్‌బాస్ తెలుగు ప్రోమో విడుదలైంది.
ఇందులో ఎన్టీఆర్ లేవగానే తన చుట్టూ ఉన్న కెమెరాలను చూసి అవాక్కవుతాడు. `నేను కెమెరాలు పెట్టమంది మా ఇంట్లో కాదు బిగ్‌బాస్ హౌస్‌లో` అంటూ తనలో ఉన్న హాస్యకోణాన్ని చూపించాడు ఎన్టీఆర్. కార్యక్రమ భావనకు దగ్గరగా ఉండేలా ప్రోమో తయారు చేసి ప్రేక్షకుల్లో ఉత్సుకతను పెంచారు. ఇప్పటికే కమలహాసన్ వ్యాఖ్యాతగా తమిళ్‌లో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో నమిత మినహా పెద్ద పెద్ద తారలు ఎవరూ లేకపోవడంతో పేలవంగా సాగుతోంది. ఇక తెలుగులో ఎవరెవరు పాల్గొంటారో చూడాలంటే ఇంకొద్ది రోజులు వేచిచూడాల్సిందే.