: శిరీష నన్ను బెదిరించింది... ఇప్పుడు రాజీవ్ అంటే అసహ్యం వేస్తోంది: తేజస్విని


రాజీవ్ ను తనతో పాటు శిరీష కూడా ఇష్టపడుతోందన్న విషయం తనకు తెలుసునని తేజస్విని పోలీసులకు వెల్లడించింది. రాజీవ్ కు దూరంగా ఉండాలని శిరీష తనను ఎన్నోసార్లు బెదిరించిందని, తనను చెప్పలేని తిట్లు కూడా తిట్టిందని తన వాంగ్మూలంలో పేర్కొంది. వేరే వ్యక్తులకు తన ఫోన్ నంబర్ ఇచ్చి వారితో తిట్టించిందని, ఆ విషయంలోనే పోలీసు కేసు పెట్టాల్సి వచ్చిందని తెలిపింది. రాజీవ్ ను తానెంతో ఇష్టపడ్డానని, శిరీషతో కలిసుండటం చూసి కోపగించుకున్నానని, ఇప్పుడు అతనిపై అసహ్యం కలుగుతోందని చెప్పింది. రాజీవ్ తనను దారుణంగా మోసం చేశాడని పేర్కొంది. అతని వైఖరిపై తనకెన్నో అనుమానాలు వచ్చినా, పిచ్చి ప్రేమతో వాటిని పక్కనబెట్టానని వాపోయింది.

ఈ కేసులో ఇన్ని రోజులూ తెరపైకి రాని తేజస్విని, ఇప్పుడు బయటకు రావడం గమనార్హం. రాజీవ్, శ్రవణ్ లను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్న వేళ, వారు చెప్పిన అంశాలపై నిజాలను నిర్ధారించుకునేందుకు తేజస్వినిని కూడా విచారించారు. అయితే, పోలీసు విచారణలో తనకు తెలిసిన వాస్తవాలను బయటపెట్టిన తేజస్విని, శిరీష వ్యక్తిగత జీవితం గురించి తనకు తెలియదని పేర్కొన్నట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఇక తేజస్విని స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన పోలీసులు కేసు విచారణ ముగింపు దశకు వచ్చిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News