: నన్ను విమర్శించడం భావ్యం కాదు: రామచంద్ర గుహ వ్యాఖ్యలపై 'ది వాల్' రాహుల్ ద్రావిడ్
ఓ వైపు భారత 'ఏ' జట్టుకు కోచ్ గా ఉంటూనే, ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కు కోచ్ గా ఎలా పని చేస్తారని చరిత్రకారుడు రామచంద్ర గుహ ప్రశ్నించడంపై భారత క్రికెట్ లో మిస్టర్ డిపెండబుల్, ది వాల్ గా పేరు తెచ్చుకున్న రాహుల్ ద్రావిడ్ స్పందించాడు. తన రాజీనామా లేఖలో కటువైన పదాలను వాడుతూ రామచంద్ర గుహ, ద్రావిడ్ పేరును ప్రస్తావిస్తూ, ద్వంద్వ ప్రయోజనాల అంశాన్ని లేవనెత్తగా, ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ద్రావిడ్ పలు కీలక వ్యాఖ్యలు చేశాడు.
"నేనేమీ బీసీసీఐ నిబంధనలను అతిక్రమించలేదు. వారు నాకు కాంట్రాక్టు ఇచ్చిన సమయంలో చెప్పిన నిబంధనలను తరువాత మార్చారేమో. నన్ను విమర్శించడం సరికాదు. నేను ఒకటే చెప్పదలచుకున్నాను. నేనొక్కడినే కాదు. నాలాగే మరో ఐదారుగురు ఆటగాళ్లూ ఉన్నారు. ఈ విషయంలో మరింత స్పష్టత అవసరం" అని అన్నాడు. కాగా, ఈ వివాదంతో మనస్తాపం చెందిన ద్రావిడ్, బీసీసీఐతో తన కాంట్రాక్టును వదులుకునేందుకు సిద్ధమైనట్టు 'టైమ్స్ ఆఫ్ ఇండియా'లో ప్రత్యేక కథనం ప్రచురితమైంది.