: ముంబై జైల్లో మహిళా ఖైదీలు ఎందుకు తిరగబడ్డారో తెలుసా?... ఎఫ్ఐఆర్ లో వెలుగు చూసిన అమానుషం!
ముంబైలోని బైకుల్లా జైలులో ఖైదీలు తిరుగుబాటు చేసి, జైలు వార్డర్లపై దాడి చేసి, ఫర్నిచర్ ద్వంసం చేసిన ఘటనలో ప్రత్యక్షసాక్షులైన ఖైదీలు చెప్పిన వివరాల ప్రకారం నమోదైన ఎఫ్ఐఆర్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఎఫ్ఐఆర్ లోని విషయం వివరాల్లోకి వెళ్తే... మంజుల షెత్యే (38) సత్ప్రవర్తన కారణంగా తన బ్యారక్ కు వార్డన్ గా గుర్తింపు పొందింది. ఈ నెల 23న ఉదయం 9 గంటలకు మంజుల తనకు ఇచ్చిన అల్పాహారంలో రెండు కోడిగుడ్లు, ఐదు బ్రెడ్డు ముక్కలు తక్కువ ఇవ్వడంతో ఈ విషయాన్ని జైలు అధికారిణి మనీషా పోఖర్కర్ కు ఫిర్యాదు చేసింది. అనంతరం మనీషా పోఖర్కర్, మంజులను పిలిచారు. మంజుల ఆమె గదిలోకి వెళ్లిన తరువాత బాధతో విలవిల్లాడుతున్న అరుపులు వినిపించాయని ఖైదీలు తెలిపారు. తరువాత బాధతోనే ఆమె తన బ్యారక్ కు తిరిగి వచ్చింది.
బ్యారక్ కు ఆమె చేరిన తరువాత బిందు నాయ్ కడే, వసీమా షైక్, షీతల్ షెగావంకర్, సురేఖ గుల్వే, ఆర్తీ షింగ్నే అనే కానిస్టేబుళ్లు ఆ బ్యారక్ లోకి వచ్చారు. వస్తూనే ఆమె దుస్తులు విప్పేసి నగ్నంగా మార్చారు. బిందు, సురేఖ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఆమె కాళ్లు విడదీసి గట్టిగా పట్టుకోగా, వసీమా షైక్ నోటితో పైకి చెప్పుకోలేని చోట లాఠీని పెట్టి రాక్షసానందం అనుభవించిందని తెలిపారు. దీంతో ఆమెకు తీవ్రమైన రక్తస్రావమైందని వారు చెప్పారు. రక్తమోడుతున్నా ఆమెకు ఎలాంటి సాయం చేయలేదని, దీంతో ఆమె బాత్రూంలో స్పృహ తప్పిపడిపోయిందని, ఆ తరువాత మొదట జైల్లోని రెసిడెంట్ డాక్టర్ వద్దకు, ఆ తరువాత చికిత్స పేరుతో జేజే ఆసుపత్రికి తరలించారని, అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిందని, దీంతో ఆగ్రహించిన ఖైదీలు దాడికి దిగారని ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. కాగా, ఈ దాడుల్లో ఇంద్రాణి ముఖర్జియాపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.