: ట్రాఫిక్‌లో అంబులెన్స్ సమస్యకు పరిష్కారం కనుగొన్న కేరళ టెక్కీలు
కొన్నిసార్లు ట్రాఫిక్‌లో అంబులెన్స్ సైరన్ వినపడగానే మనసులో దారి ఇవ్వాలని ఉన్నా, చుట్టూ ఉన్న గందరగోళం వల్ల ఇవ్వలేని పరిస్థితి. ఇక ఆ అవసరం లేదు. కొచ్చికి చెందిన రాజగిరి ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు మహ్మద్ జాసీం, మహ్మద్ సాధిక్‌లు వారి అంకుర సంస్థ ట్రాఫిట్జర్ టెక్నాలజీస్ తరఫున ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టారు. దీని పేరు `ట్రాఫిట్జర్- ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టం (టీఈఆర్ఎస్)`.
తక్కువ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌ల ఉపయోగంతో, ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థను కొచ్చి నగర ట్రాఫిక్ పోలీసు శాఖ ఆధ్వర్యంలో విజయవంతంగా పరీక్షించారు. అందుబాటులో ఉన్న ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థకు పేషెంటు ఉన్న అంబులెన్స్‌ను టీఈఆర్ఎస్ ద్వారా అనుసంధానం చేసినపుడు వెళ్లవలసిన దారిలో ఉన్న ట్రాఫిక్ జంక్షన్లన్నీ అంబులెన్స్‌కు దారిని సుగమం చేస్తాయి. ఈ ప్రయాణాన్ని పూర్తిగా విజయవంతం చేయడానికి ఆయా జంక్షన్ల వద్ద ఉన్న పోలీసులు మిగిలిన వాహనదారులను నియంత్రించగలిగితే చాలు.
మానవత్వ ఉద్దేశంతో తయారు చేసిన ఈ టీఈఆర్ఎస్ వ్యవస్థను త్వరలో వీలైనన్ని ఎక్కువ నగరాలకు అభివృద్ధి చేయనున్నట్లు మహ్మద్ జాసీం, మహ్మద్ సాధిక్‌లు తెలిపారు.