: నన్ను విమర్శించడానికి మీరెవరు?: 'డీజే' డైరెక్టర్ హరీశ్ శంకర్ మండిపాటు
గత వారంలో విడుదలైన 'డీజే: దువ్వాడ జగన్నాథమ్' సినిమాపై కొన్ని వెబ్ సైట్లలో వచ్చిన రివ్యూలపై దర్శకుడు హరీశ్ శంకర్ ఫైర్ అయ్యాడు. ఈ రివ్యూలపై మండిపడ్డ ఆయన, తనకు కళ్లు నెత్తికెక్కాయనడానికి మీరెవరు? అని ప్రశ్నించాడు. "ఎవరి విమర్శలకూ నేను సమాధానం చెప్పను. నా తీరే ఇంత. నా యాటిట్యూడ్ వల్లే గబ్బర్ సింగ్ వచ్చింది. మంచి ఎంటర్ టైనర్ వస్తే, రెవెన్యూలు చూడాలి కానీ, రివ్యూలు కాదు. నన్ను విమర్శించడానికి మీరెవరు?" అని అన్నాడు. ఈ చిత్రంపై తొలి రోజున మిక్స్ డ్ రివ్యూలు వచ్చిన విషయం తెలిసిందే. కొన్ని వెబ్ సైట్లు సినిమా ఘోరమని కూడా వ్యాఖ్యానించగా, కలెక్షన్ల విషయంలో మాత్రం చిత్రం బాగానే వుంది. ఈ నేపథ్యంలో హరీశ్ చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో కొత్త చర్చకు తెరలేపాయి.