: ట్రంప్, మోదీ.. ఆ ఇద్దరి మధ్యా కెమిస్ట్రీ అద్భుతం!
కరచాలనాలు, ఆలింగనాలు, ఆప్యాయ పలకరింపులు... భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లు తొలిసారిగా కలసిన వేళ, ఇద్దరు దేశాధినేతల మధ్యా కెమిస్ట్రీ అద్భుతం. ఫస్ట్ లేడీ మిలానియా ట్రంప్ తో కలసి మోదీకి ఘన స్వాగతం పలికిన ట్రంప్, రెండు సార్లు ఆలింగనం చేసుకున్నారు. తమ మధ్య ఉన్న స్నేహాన్ని తెలుపుతూ షేక్ హ్యాండ్ ఇచ్చారు. తామెంతో దగ్గరి వారమన్న సంకేతాలను చూపేందుకు ఇద్దరూ ప్రయత్నించారు. పారిస్ వాతావరణ ఒప్పందం విషయంలో వచ్చిన తేడాలు, ఆపై భారత్ ను ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు వీరి మధ్య ఎంతమత్రమూ అభిప్రాయభేదాలను పెంచలేకపోయాయని ఈ కలయికతో తేటతెల్లమైంది.
"ఇద్దరు నేతల మధ్య స్పష్టమైన కెమిస్ట్రీ కనిపించింది" అని విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్ వ్యాఖ్యానించారు. ట్రంప్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగకముందు జరిగిన ఘటనలను మోదీ గుర్తు చేసుకున్నారు. 2014లో ముంబై, పుణె పర్యటనకు ట్రంప్ వచ్చిన సమయంలో, తన పనితీరును ఆయన మెచ్చుకున్నారని, ఆ విషయం తనకింకా గుర్తుందని తెలిపారు.