: హ్యాండ్ వాష్ లతో మేలు కంటే కీడే ఎక్కువ?


చేతులను నిత్యం శుభ్రంగా ఉంచుకోవాలని, అలా చేయని పక్షంలో రోగాలు దరి చేరుతాయని టీవీలలో హ్యాండ్ వాష్ ప్రకటనలు ఊదరగొడుతుంటాయి. ప్రధానంగా 'బంటీ నీ సబ్బు స్లోనా ఏంటి?' అంటూ వచ్చే యాడ్ చాలా మందిపై పెను ప్రభావం చూపుతోంది. దీంతో ఒంటికి సబ్బున్నా లేకున్నా హ్యాండ్ వాష్ లేదా సబ్బు ప్రతి ఇంటా తప్పనిసరిగా మారింది. ఆరోగ్యంగా ఉండడం మంచిదే...అయితే యాంటీ బ్యాక్టీరియల్‌ సబ్బులు, ద్రావణాల (లిక్విడ్‌) వినియోగం మొదటికే మోసం తెస్తోందని 200 మందికిపైగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో తేలింది. ఈ మేరకు ఎన్విరాన్‌మెంటల్‌ హెల్త్‌ పర్స్‌పెక్టివ్స్‌ జర్నల్‌ లో పలు కీలక విషయాలను వారు వివరించారు. హ్యాండ్ వాష్ సబ్బులు, లిక్విడ్స్ తో ప్రయోజనం శూన్యమని, దీర్ఘకాలంలో కీడెక్కువ జరుగుతుందని వారు స్పష్టం చేశారు.

వీటితో ప్రధానంగా గర్భిణులు, పాలిచ్చే తల్లులకు హానికరమని వారు తేల్చిచెప్పారు. ఈ సబ్బులు, లిక్విడ్ లలో యాంటీబ్యాక్టీరియల్‌ రసాయనాలు గర్భిణుల శరీరంలో బిడ్డ ఎదుగుదలకు కారణమయ్యే అనేక హార్మోన్లను, ఇతర వాటిని ప్రభావితం చేస్తున్నాయని వారు వెల్లడించారు. దీంతో వారి శారీరక, మానసిక ఎదుగుదలపై ఇవి తీవ్ర ప్రభావం చూపుతున్నాయని, అంతే కాకుండా వ్యాధుల నివారణ, ఇన్‌ ఫెక్షన్ల నిరోధంలో సాధారణ సబ్బుల కంటే ఇవి ఎక్కువ ప్రభావం చూపుతాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లభించలేదని వారు స్పష్టం చేశారు. అందుకే అమెరికా ప్రభుత్వం గత ఏడాది వీటిని నిషేధించిందని వారు ఆ జర్నల్ లో వెల్లడించారు. కేవలం యాంటీబాక్టీరియల్ సబ్బులు, లిక్విడ్ లు మాత్రమే కాకుండా యాంటీ బ్యాక్టీరియా రసాయనాలతో తయారవుతున్న భోజనం బాక్స్‌ లు, వ్యాయామ చాపలు వంటి వాటితో కూడా పెను ప్రమాదమని వారు హెచ్చరిస్తున్నారు.

  • Loading...

More Telugu News