: రవితేజ సోదరుడు భరత్ మృతిపై ఎందుకంత రహస్యం? దాని వెనుక అసలు కథ ఇదేనా?
ప్రముఖ నటుడు రవితేజ సోదరుడు భరత్ రాజు కారు ప్రమాదంలో మృతి చెందడం, ఆ వార్త వెంటనే బయటకు రాకపోవడంపై ఇప్పటికే పలు అనుమానాలు ఉన్నాయి. దీనికితోడు, భరత్ అంత్యక్రియలకు రవితేజ మరో సోదరుడు రఘు మినహా వారి కుటుంబసభ్యులెవ్వరూ హాజరుకాకపోవడం, డబ్బులిచ్చి బయటి వ్యక్తితో భరత్ అంత్యక్రియలు నిర్వహించాలనుకోవడం వంటివి మరిన్ని అనుమానాలు తలెత్తేలా చేస్తున్నాయి. ఈ విషయమై ఇప్పటికే రవితేజ అభిమానులు, నెటిజన్లు సామాజిక మాధ్యమాల ద్వారా విమర్శలు చేస్తున్నారు.
కాగా, శనివారం రాత్రి పది గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో భరత్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ విషయం మర్నాడు ఉదయం పది గంటలకు గానీ మీడియాకు తెలియలేదు. కానీ, భరత్ కుటుంబసభ్యులకు మాత్రం కారు ప్రమాదం జరిగిన రోజు రాత్రి 12 గంటలకే తెలిసిందట. అయితే, ఈ విషయాన్ని బయటకు, ముఖ్యంగా మీడియాకు తెలియకుండా జాగ్రత్త పడాలన్న ఉద్దేశంతో పోలీసులను భరత్ కుటుంబసభ్యులు మేనేజ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఓ సీఐ, ఎస్సై స్థాయి అధికారులు సహకరించినట్టు సమాచారం. అయితే, పోలీసు శాఖలోని ఓ ఉద్యోగి ద్వారా మర్నాడు ఉదయం 8.30 సమయంలో ఒక మీడియా ప్రతినిధికి భరత్ మృతి వార్తను లీక్ చేశారని సమాచారం.
ప్రమాదం జరిగిన రాత్రి 12 గంటలకే భరత్ తల్లి రాజ్యలక్ష్మికి పోలీసులు సమాచారం అందించినా.. తెల్లవారే వరకు ఉస్మానియా ఆసుపత్రి ముఖం కూడా కుటుంబ సభ్యులు చూడలేదు. పోస్ట్‌మార్టం సమయంలోనూ బయటివాళ్లే అక్కడ ఉన్నారు. కారు డ్రైవర్ కుమార్‌నే భరత్ మృతదేహాన్ని తీసుకుని మహాప్రస్థానానికి వెళ్లాలని రవితేజ కుటుంబం ఆదేశించిందట. అయితే, భరత్ కు చెందిన రక్త సంబంధీకులు లేనిదే అతని మృతదేహాన్ని అప్పగించమని ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో రాజ్యలక్ష్మిని డ్రైవర్ కుమార్ తిరిగి సంప్రదించాడట. దీంతో, రవితేజ చిన్న సోదరుడు రఘుని పంపించి భరత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారట. అలాగే భరత్ మృతదేహాన్ని మొదట కట్టెలపైనే దహనం చేయాలని అనుకున్నారట. అందుకుగాను, ఓ వ్యక్తికి రూ.1500 లిచ్చి, ఆ కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నారని, మీడియా కెమెరాల్లో ఆ బయటవ్యక్తి కనిపిస్తే అతడు ఎవరనే ప్రశ్న తలెత్తుతుందనే అనుమానంతో, చివరి నిమిషంలో ఎలక్ట్రిక్ దహనవాటికకు భరత్ మృతదేహాన్ని తరలించినట్లు తెలుస్తోంది.
చిన్న కర్మ మాత్రం అలా డబ్బులిచ్చి తెచ్చిన వ్యక్తితోనే పూర్తి చేయించారట. అతడికి తోడుగా దూరపు బంధువు మూర్తి రాజు కూడా ఉండేలా జాగ్రత్త పడ్డారు. అయితే, భరత్ మరణవార్త విషయాన్ని ఎందుకంత రహస్యంగా ఉంచాల్సి వచ్చిందంటే... రవితేజ ఇమేజ్ ను భరత్ సర్వనాశనం చేస్తున్నాడనే కారణంగా గత మూడేళ్లుగా అతన్ని ఆ కుటుంబం వెలివేసినంత పని చేసిందట. ఈ విషయాన్ని రవితేజ తల్లిదండ్రులు పలువురి వద్ద ప్రస్తావించినట్టు తెలుస్తోంది. అందుకే, భరత్ అంత్యక్రియలను రహస్యంగానే కానిచ్చేయాలని ఆ కుటుంబం భావించినట్టు సమాచారం. తమ్ముడిని చివరి చూపు చూసి తట్టుకోలేకనే శ్మశానానికి రాలేదని చెబుతున్న రవితేజ మాటలు వెనుక అసలు కథ ఇదీ అని తెలుస్తోంది.