: తమ్ముడి అంత్యక్రియలకు వెళ్లలేదు కానీ.. మరుసటి రోజే షూటింగుకు మాత్రం వెళ్లాడు!: రవితేజపై విమర్శలు
మాస్ మహారాజ్ గా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న హీరో రవితేజ.. సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలకోర్చి ఎదిగిన విషయం తెలిసిందే. తన దైన నటన, డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని, అభిమానులను సొంతం చేసుకున్న రవితేజపై నిన్నటి వరకూ ఎటువంటి విమర్శలూ లేవు. కానీ, కారు ప్రమాదంలో మృతి చెందిన తన సోదరుడు భరత్ రాజు అంత్యక్రియలకు రవితేజ హాజరుకాకపోవడంపై మాత్రం విమర్శలు గుప్పుమంటున్నాయి.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో భరత్ అంత్యక్రియలు నిన్న జరిగాయి. ఈ అంత్యక్రియలకు హాజరుకాని రవితేజ, తన చిత్రం షూటింగ్ కు మాత్రం ఈ రోజు వెళ్లాడు. దీనిపై, ఆయన అభిమానులు, నెటిజన్లు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ్ముడి అంత్యక్రియలకు హాజరుకాలేదు కానీ.. మరుసటి రోజే షూటింగ్ కు మాత్రం వెళ్లాడని విమర్శిస్తున్నారు. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న‘రాజా ది గ్రేట్’ షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. తమ్ముడి మరణంతో బాధగా ఉన్న రవితేజ, షూటింగ్ కు రారని దర్శకుడు భావించి, వాయిదా వేయాలని అనుకున్నారట. అయితే, దర్శకుడు ఊహించిన దానికి భిన్నంగా తాను షూటింగ్ కు వస్తున్నానని రవితేజ ఫోన్ చేసి చెప్పారట. కాగా, అన్నపూర్ణ స్టూడియోలో 'మనం' సినిమా కోసం నాడు వేసిన ఇంటి సెట్ లో రవితేజ, హీరోయిన్ మెహ్రీన్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు సమాచారం.