: శతాబ్ది, రాజధాని రైళ్లకు కొత్త హంగులు!
క్రమపద్ధతిలో కేటరింగ్, మర్యాదగా ప్రవర్తించే సిబ్బంది, ప్రయాణంలో వినోదం వంటి సేవలను శతాబ్ది, రాజధాని రైళ్లలో ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే రంగం సిద్ధం చేసింది. అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్న పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ప్రయాణికుల సౌకర్యార్థం అత్యున్నత సేవలతో, కొత్త హంగులతో శతాబ్ది, రాజధాని రైళ్లను తీర్చిదిద్దుతోంది. `ప్రాజెక్ట్ స్వర్ణ్` అనే పేరుతో కొనసాగుతున్న ఈ పథకానికి రూ. 25 కోట్లు ఖర్చు చేయనున్నారు.
ఇందులో భాగంగా 15 రాజధాని, 15 శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లకు కొత్త కళను తీసుకురానున్నారు. సిబ్బంది పనితీరు, టాయ్లెట్ల శుభ్రత, కేటరింగ్ సర్వీస్‌ల గురించి వచ్చిన అనేక ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ముందడుగు వేస్తున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దీంతో పాటు ప్రయాణికుల రక్షణకు, వారికి అందుతున్న సేవల్లో లోటుపాట్ల గురించి తక్షణమే సహకరించేందుకు వీలుగా ఆయా రైళ్లలో ప్రత్యేక రైల్వే పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.