: శిరీష కేసు విచారణలో పోలీసులు శ్రవణ్, రాజీవ్ లకు వేయనున్న పది ప్రశ్నలు!
హైదరాబాదు, ఫిల్మ్ నగర్ లోని ఆర్జీఏ స్టూడియోలో ఆత్మహత్యకు పాల్పడిన శిరీష కేసులో నిందితులు శ్రవణ్, రాజీవ్ లను చంచల్ గూడ జైలు నుంచి బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీస్ స్టేషన్ కు తరలించి విచారించనున్నారు. విచారణ సందర్భంగా ప్రధానంగా పది ప్రశ్నలను వారు సంధించనున్నారు. ఈ పది ప్రశ్నలతో ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని ఆశిస్తున్నారు. ఏ సెటిల్మెంట్ కోసం శిరీషను కుక్కునూరుపల్లి తీసుకెళ్లారు? అర్ధరాత్రి సెటిల్మెంట్ కోసం వెళ్తే.. మద్యం బాటిల్ కొనుక్కెళ్లాల్సిన అవసరం ఏంటి? నలుగురూ మద్యం తాగారా? లేదా? శిరీషను ఎస్సై ప్రభాకర్ రెడ్డి దగ్గర ఎందుకు వదిలి వెళ్లారు?
శిరీషను వదిలి కేవలం సిగిరెట్ తాగేందుకు మాత్రమే వెళ్తే.. శిరీష ఎందుకు అంత గట్టిగా కేకలు వేసింది? అంతగా భయపడాల్సిన అవసరం ఏమొచ్చింది?... ఈ ఎపిసోడ్ అంతా పోలీస్ క్వార్టర్స్ లోనే జరిగిందా? పోలీస్ క్వార్టర్స్ లోనే జరిగితే శిరీష ఫాంహౌస్ లొకేషన్ ను ఎలా షేర్ చేసింది? అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎస్సై ప్రభాకర్ రెడ్డి శిరీషను అత్యాచారం చేశాడా? లేదా? శిరీషను రాజీవ్ కారులో అంతలా కొట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజీవ్ కొట్టిన దెబ్బలకే శిరీష ప్రాణాలు పోయాయా?... శిరీష స్టూడియోకి వచ్చిన తరువాత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? శిరీష ఆడియో క్లిప్పులను విడుదల చేసింది ఎవరు? ఆడియో క్లిప్పుల్లో ఉన్న నందు, నవీన్ లు ఎవరు? ఈ కేసులో తేజస్విని పాత్ర ఎంత? వంటి ప్రశ్నలను సంధించనున్నారు.