: కోచ్ లేని లోటును ధోనీ, యువరాజ్ తీరుస్తున్నారు!: సంజయ్ బంగర్
అనిల్ కుంబ్లే దూరమైన తరువాత కోచ్ లేకుండానే వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు సీనియర్లు మహేంద్ర సింగ్ ధోనీ, యువరాజ్ సింగ్ మార్గదర్శకులుగా నిలిచారని బ్యాటింగ్ కోచ్ గా సేవలందిస్తున్నసంజయ్ బంగర్ వ్యాఖ్యానించాడు. జట్టుకు వీరిద్దరూ మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్నారని, వారి సలహాలు, సూచనలతో మిగతా సభ్యులు ముమ్మరంగా ప్రాక్టీస్ చేస్తూ, విండీస్ లో విజయమే లక్ష్యంగా కృషి చేస్తున్నారని అన్నాడు.
జట్టులో ఎంతో అనుభవమున్న యువరాజ్, ధోనీ వంటి వారు ఉండటంతో, హెడ్ కోచ్ లేడన్న ఆలోచన ఎవరిలోనూ లేదని తెలిపాడు. వారు జూనియర్ ఆటగాళ్లకు విలువైన సలహాలు ఇస్తున్నారని, ఎన్నో ఆలోచనలను తమ ముందు ఉంచుతున్నారని తెలిపారు. 302 మ్యాచ్ లు ఆడిన యువరాజ్, 292 మ్యాచ్ లు ఆడిన ధోనీ, 185 మ్యాచ్ ల అనుభవమున్న కోహ్లీలుండగా, కోచ్ లేని ప్రభావం జట్టుపై ఎంతమాత్రమూ లేదని సంజయ్ బంగర్ పేర్కొనడం గమనార్హం.