: ప్రయాణికులకు కోపమొచ్చింది: రెండున్నర గంటలు ట్రైన్ ని ఆపేశారు!
భోజనం బాగాలేదని ఆరోపిస్తూ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లో రాజధాని ఎక్స్ ప్రెస్ రైలును ప్రయాణికులు సుమారు రెండున్నర గంటలపాటు కదలనివ్వలేదు. ఘటన వివరాల్లోకి వెళ్తే... చెన్నై నుంచి నిజాముద్దిన్ కు వెళ్లాల్సిన రాజధాని ఎక్స్‌ప్రెస్ లో భోజనం బాగాలేదంటూ నాగ్ పూర్ నుంచి ప్రయాణికులు ఆందోళన చేస్తున్నారు. అయితే రైలు సిబ్బంది దీనిని పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహానికి గురైన ప్రయాణికులు సికింద్రాబాద్ లోని 10వ నెంబర్ ప్లాట్ ఫాంపై రైలు ఆగగానే ఆందోళన ప్రారంభించారు.
చెయిన్ లాగి ట్రైన్ ను ముందుకు కదలనివ్వలేదు. దీంతో సమాచారం తెలుసుకున్న రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) సీఐ రాజగోపాల్‌రెడ్డి, సికింద్రాబాద్ రైల్వే పోలీస్టేషన్ ఇన్‌చార్జి ఇన్‌స్పెక్టర్ చంద్రయ్య, స్టేషన్ మాస్టర్ ప్రసాద్ రైల్వే ఏఆర్ సిబ్బంది ప్రయాణికులతో చర్చించి, వారిని శాంతింపజేశారు. ట్రైన్ లోని భోజనం వద్దని చెప్పడంతో, స్టేషన్ లో వారికి భోజనం పెట్టించి పంపించారు. సుమారు రెండున్నర గంటలు ఈ తతంగమంతా చోటుచేసుకోవడం విశేషం.