: ఒంటరి మహిళలకు హైదరాబాదులో హోటల్ రూంలివ్వరా?: సింగపూర్ మహిళ సూటి ప్రశ్న
సింగపూర్ కు చెందిన నుపుర్ సారస్వత్ (22) అనే మహిళకు హైదరాబాదులో ఊహించని అనుభవం ఎదురైంది. దీంతో దీనిపై సోషల్ మీడియా వేదికగా ఆమె నిలదీయడంతో అది వైరల్ అయింది. ఆర్టిస్ట్ అయిన ఆమె వివిధ షోలలో పాల్గొనేందుకు ఇండియా మొత్తం తిరగాల్సి వస్తోంది. అలాగే హైదరాబాదుకు కూడా వచ్చింది. దీపికా పదుకునే బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న ఒక యాప్ ద్వారా ఆమె హోటల్ బుక్ చేసుకుంది. దీంతో విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్ కు వెళ్లింది. అయితే హోటల్ సిబ్బంది ఆమెకు రూమ్ ఇచ్చేందుకు నిరాకరించారు. ఎందుకు? అని ప్రశ్నించడంతో ఒంటరి మహిళలకు హోటల్ లో రూంలు ఇవ్వమని తేల్చిచెప్పారు. దీంతో ప్రయాణబడలికతో అలసిపోయిన ఆమె ఈ విషయాన్ని హోటల్ బుకింగ్ యాప్ కేర్ కు తెలియజేసింది.
సింగిల్ వుమెన్ కు ప్రవేశం లేని హోటల్ లో రూమ్ బుక్ చేసుకోవడానికి తనకు ఎలా అనుమతి ఇచ్చారంటూ సదరు యాప్ నిర్వాహకులపై మండిపడింది. దీంతో సమస్యను సరిదిద్దుతామని హామీ ఇచ్చిన యాప్ సిబ్బంది ఆమెకు మరో హోటల్ లో బస ఏర్పాటు చేశారు. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్ కావడంతో ఆమెకు బస నిరాకరించిన హోటల్ యాజమాన్యం మాట్లాడుతూ, పెళ్లి కాని కపుల్స్ వచ్చినా కూడా తాము రూమ్ ఇవ్వమని, తాముంటున్న ఏరియాను దృష్టిలో పెట్టుకొని అటువంటి నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.
దీనిపై ఆ యాప్ బ్రాండ్ అంబాసిడర్ దీపికా పదుకునేకు కూడా ఆమె ట్వీట్ చేశారు. తన సమస్యను వివరిస్తూనే... ఒంటరిగా దేశమంతా ప్రయాణించే మహిళలకు సేఫ్ ప్లేస్ ఎక్కడుంటుందో చెప్పాలంటూ దీపికను ప్రశ్నించారు. ఆమె కూడా ఒంటరిగానే ప్రయాణాలు చేస్తుందని, అలాంటప్పుడు ఒంటరి మహిళలకు అవసరమైనట్టుగా యాప్ ను ఎందుకు డెవలప్ చేయలేదని ఆమె నిలదీసింది. దీంతో దిగివచ్చిన యాప్ నిర్వాహకులు ఆమేరకు మార్పులు చేర్పులు చేస్తామని ఆమెకు హామీ ఇచ్చారు.