: ఘన విజయంతో బోణీ కొట్టిన భారత్... రహానే సెంచరీ, కోహ్లీ, ధావన్ హాఫ్ సెంచరీలు!
వెస్టిండీస్ పర్యటనలో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్పణమైనా, రెండో వన్డేలో భారత్ సత్తా చాటింది. ఓపెనర్ అజింక్య రహానే సెంచరీ (103)తో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ (87), శిఖర్ ధావన్ (63) రాణించడంతో 105 పరుగుల తేడాతో విజయం సాధించి 5 మ్యాచ్ ల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా, వర్షం కారణంగా 43 ఓవర్లకు కుదించిన మ్యాచ్ లో భారత జట్టు 5 వికెట్ల నష్టానికి 310 పరుగుల స్కోరు సాధించింది.
భారీ టార్గెట్ తో విండీస్ బరిలోకి దిగగా, ఆదిలోనే భువనేశ్వర్ ధాటికి రెండు వికెట్లు కూలాయి. దీంతో కుదేలైన విండీస్ జట్టులో హోప్ (89) ఒంటరి పోరాటం చేసినా, మిగతా బ్యాట్స్ మెన్ నుంచి ఏమాత్రం సహకారం అందక పోవడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 205 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత జట్టులో సెంచరీ చేసిన రహానేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది.