: చిరంజీవి గ్రేట్ డ్యాన్సర్: నటి శ్రీదేవి కితాబు
చిరంజీవి గొప్ప డ్యాన్సర్ అని ప్రముఖ నటి శ్రీదేవి అన్నారు. శ్రీదేవి నటించిన ‘మామ్’ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడింది. గతంలో చిరంజీవితో కలిసి శ్రీదేవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోక సుందరి’ గురించి, అందులో చిరంజీవితో కలిసిన చేసిన డ్యాన్స్ గురించి ప్రశ్నించగా ఆసక్తికర సమాధానాలు చెప్పింది.
‘చిరంజీవితో కలిసి డ్యాన్స్ చేసేటప్పుడు మీరెలా ఫీలయ్యేవారు. ఓ కాంపిటీటర్ తో డ్యాన్స్ చేస్తున్నట్టు ఫీలయ్యేవారా?’ అని ప్రశ్నించగా, శ్రీదేవి సమాధానమిస్తూ .. ‘వెరీగుడ్ డ్యాన్సర్ .. గ్రేట్ డ్యాన్సర్. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’కి ప్రభుదేవా డ్యాన్స్ మాస్టర్.. ఇంక చెప్పేదేముంది?’ అని శ్రీదేవి చెప్పింది. ఈ సందర్భంగా నాటి నటులు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు సరసన హీరోయిన్ గా ఆమె నటించిన విషయాలను ప్రస్తావిస్తూ.. వాళ్లందరూ ‘లెజెండ్స్’ అని ప్రశంసించింది.
హీరోయిన్ గా తన మొదటి చిత్రం ‘పదహారేళ్ల వయసు’ ను ఎన్నటికీ మరచిపోలేనని, అలాగే, రాఘవేంద్రరావు దర్శకత్వంలోని ‘వేటగాడు’, ‘దేవత’... మొదలైన చిత్రాలు మరచిపోలేమని పేర్కొంది. హీరోయిన్లు వర్షపు సీన్ లో నటించే సన్నివేశాలు చూసే ప్రేక్షకులకు బాగానే ఉంటాయి కానీ, నటించే హీరోయిన్లకే కష్టంగా ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా శ్రీదేవి చెప్పింది.