: రాత్రి 9:15కు మాట్లాడా... తెల్లారేసరికి ఇలా అవుతుందని అనుకోలేదు: భరత్ స్నేహితుడు, అడ్వొకేట్ ఆదిత్య
గత రాత్రి 9:15 గంటల సమయంలో తాను రవితేజ సోదరుడు భరత్ రాజుతో మాట్లాడానని, ఆపై తెల్లారి ఆయన మరణవార్తను మీడియాలో చూసి ఆవేదన చెందానని అడ్వొకేట్ ఆదిత్య వ్యాఖ్యానించారు. కొద్దిసేపటి క్రితం ఉస్మానియా ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడుతూ, నాలుగేళ్ల నుంచి భరత్ తో తనకు పరిచయం ఉందని, ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవాళ్లమని చెప్పారు.
ఇటీవల తనకు వివాహమైందని, అందువల్ల గత కొంతకాలంగా తామిద్దరమూ కలవలేకపోయామని, రాత్రి మాట్లాడుతూ, కలసి డిన్నర్ చేసేందుకు పిలిచానని, తరువాత మాట్లాడతానని చెప్పి భరత్ ఫోన్ పెట్టేశారని ఆదిత్య చెప్పుకొచ్చారు. ఆ సమయంలో ఆయన మద్యం తాగి ఉన్నారా? అన్న విషయమై తనకు తెలియదని చెప్పారు. తనకు భరత్ తో తప్ప వారి కుటుంబీకులెవరితోనూ పరిచయాలు లేవని అన్నారు. రాత్రి తాను మాట్లాడిన స్నేహితుడు తెల్లారేసరికి దూరమవుతాడని ఊహించలేదని అన్నారు.