: భరత్ మరణానికి 140 కి.మీ వేగమే ప్రధాన కారణమంటున్న పోలీసులు!
గత రాత్రి ఔటర్ రింగురోడ్డుపై గంటకు 140 కిలోమీటర్ల వేగంతో తమ కుటుంబానికే చెందిన స్కోడా కారును స్వయంగా నడుపుకుంటూ వెళ్లిన భరత్ రాజు, ఆ కారును ఆగి ఉన్న లారీని బలంగా ఢీకొట్టాడని, అంతకుముందు ఆయన శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సమీపంలోని నోవాటెల్ నుంచి గచ్చిబౌలిలోని ఇంటికి బయలుదేరానని పోలీసులు వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో వోడ్కా మద్యం బాటిళ్లు ఉన్నాయని, వాటిని స్వాధీనం చేసుకున్నామని, భరత్ మద్యం తాగి ఉన్నారా? లేదా? అన్న విషయం పోస్టుమార్టం నివేదికలో వెల్లడవుతుందని తెలిపారు.
ప్రమాదం గురించి ముందే పసిగట్టి బలంగా బ్రేకులు వేసినట్టుగా రోడ్డుపై పడ్డ టైర్ గుర్తులు చూపుతున్నాయని అన్నారు. ప్రమాదంలో ఆయన ఎడమ కాలు, కుడి చెయ్యి విరిగిపోయాయని, తలకు బలమైన గాయం తగిలిందని, తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేసేంత సమయం కూడా లేకుండానే ఆయన ప్రాణాలు పోయి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా రింగురోడ్డుపై లారీని నిలిపినందుకు యాజమాన్యంపైనా కేసును నమోదు చేసినట్టు తెలిపారు.