: కన్నబిడ్డేనని తెలిసినా గట్టిగా హత్తుకుని ఏడ్వలేని పరిస్థితి... చిన్నారి మీనా అంత్యక్రియలు పూర్తి
ఆ తల్లిదండ్రులకు ఎవరికీ రాకూడని కష్టం వచ్చింది. కూతురు మృతదేహమని తెలిసినా, గట్టిగా హత్తుకుని ఏడ్వలేని పరిస్థితి. గురువారం బోరు బావిలో పడ్డ చిన్నారి మీనా మృతదేహాన్ని నేడు హై పవర్ వాక్యూమ్ ప్రెజర్ సాయంతో బయటకు తీయగా, పాప ధరించిన డ్రస్ మాత్రమే గుర్తు పట్టే స్థితిలో బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. శరీరమంతా పూర్తిగా ఛిద్రంకాగా, చిన్న చిన్న ముక్కలను బకెట్ లో తీసుకువెళుతున్న దృశ్యాలు చూపరులను కంటతడి పెట్టించాయి. ఆపై చేవెళ్లలో వైద్యులు పోస్టుమార్టం చేసి, పాప శరీరపు భాగాలను ఓ చిన్న అట్టపెట్టెలో పెట్టి తల్లిదండ్రులకు అప్పగించగా, ఆ వెంటనే ఆంబులెన్స్ లో మీనా తల్లిదండ్రుల స్వస్థలమైన రంగారెడ్డి జిల్లా యాలాల మండలం గోరేపల్లికి తరలించారు. అక్కడ సంప్రదాయ అంత్యక్రియలను పూర్తి చేశారు.