: రాజకీయాల్లో రాణిస్తానా?: జ్యోతిష్కులను ఆశ్రయించిన రజనీకాంత్
అభిమానుల కోరిక మేరకు రాజకీయాల్లోకి వస్తే రాణిస్తానా? నేను కింగ్ నవుతానా? కింగ్ మేకర్ గా మిగులుతానా? అసలు నాకు రాజకీయాలు సరిపడతాయా? ఈ ప్రశ్నలకు సమాధానాన్ని కనుగొనేందుకు సూపర్ స్టార్ జ్యోతిష్కులను సంప్రదించినట్టు తెలుస్తోంది. రజనీకి దగ్గరి వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు నలుగురు జ్యోతిష్కులను ఆయన సంప్రదించినట్టు సమాచారం. వీరిలో ముగ్గురు రజనీకి అనుకూల ఫలితాలు వస్తాయని చెప్పగా, ఒకరు మాత్రం రాజకీయాల జోలికి వద్దని, అవి అచ్చిరావని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది.
రజనీ సంప్రదించిన జ్యోతిష్కుల్లో ఓ తెలుగు వ్యక్తితో పాటు కర్ణాటకకు చెందిన ఒకరు, తమిళనాడుకు చెందిన ఇద్దరు ఉన్నట్టు సమాచారం. రజనీ రాజకీయ ప్రవేశంపై ఇప్పటివరకూ ఎటువంటి అధికారిక సమాచారమూ వెలువడలేదు. ఇటీవల ఆయన తన అభిమానులతో సమావేశమైన వేళ, యుద్ధం వస్తే చేసేందుకు సిద్ధమని వ్యాఖ్యానించడంతో ఆయన మనసులో రాజకీయ ప్రవేశంపై స్పష్టమైన ఉద్దేశంతోనే ఉన్నారని, సరైన సమయం కోసం వేచి చూస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.