: స్మార్ట్‌ఫోన్ మీకు సమీపంలో ఉందా?.. అది ఆఫ్‌లో ఉన్నా సరే మీ సామర్థ్యం గల్లంతే!
స్మార్ట్‌ఫోన్ మీకు సమీపంలోనే ఉందా? అది ఆఫ్‌లో ఉన్నా సరే మీ చేతికి అందేంత దూరంలో ఉంటే మీ సామర్థ్యాలకు కష్టకాలం దాపురించినట్టే. స్మార్ట్‌ఫోన్ మనిషిలోని మేధో వికాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని తమ అధ్యయనంలో తేలినట్టు ఆస్టిన్‌లోని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన మెక్ కోంబ్స్ బిజినెస్ స్కూల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అడ్రియన్ వార్డ్ తెలిపారు. ఫోన్ సమీపంలో ఉంటే మెదడులోని ఓ భాగం పనిచేయడాన్ని ఆపేసి ఫోన్ తీయమని మొత్తుకుంటుందని ఆయన పేర్కొన్నారు. 800 మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైనట్టు ఆయన పేర్కొన్నారు.
స్మార్ట్‌ఫోన్లను వినియోగించకున్నా వారికి దగ్గరగా ఉన్నప్పుడు వారి పనితీరును అధ్యయనం చేశారు. జేబులో, సమీపంలో ఉన్న సెల్‌ఫోన్లను సైలెంట్‌లో పెట్టి ఒకసారి, పక్క గదిలో పెట్టి మరోసారి వారిపై పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్మార్ట్‌ఫోన్లు సమీపంలో ఉన్నప్పుడు వారిలోని పనితీరు మందగించిన విషయాన్ని గుర్తించారు. అలాగే వారి మేధో సామర్థ్యం కూడా గణనీయంగా తగ్గినట్టు కనుగొన్నారు. అలాగే మెదడు పనితీరుపైనా తీవ్ర ప్రభావం పడినట్టు గుర్తించారు. చేస్తున్న పనిపై పూర్తిగా దృష్టి సారించాలని అనుకున్నా మెదడు మాత్రం అందుకు సహకరించని విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. మొబైల్ ఆఫ్‌లో ఉందా? ఆన్‌లో ఉందా? అనేది సమస్య కాదని, వారికి సమీపంలో ఉంటే దాని ప్రభావం వారిపై పడుతోందని గుర్తించినట్టు వార్డ్ వివరించారు.