: ఆర్జేడీ, కాంగ్రెస్‌తో వేగలేకపోతున్న నితీశ్.. ఎన్డీఏలోకి వస్తే స్వాగతిస్తామన్న బీజేపీ
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ఎన్‌డీఏలోకి వస్తే స్వాగతిస్తామని బీజేపీ, లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జీపీ)లు పేర్కొన్నాయి. నితీశ్ కుమార్ ఎన్‌డీఏలో చేరాలన్న కేంద్రమంత్రి, ఎల్‌జీపీ నేత రామ్ విలాస్ పాశ్వాన్ వ్యాఖ్యలపై బీజేపీ నేత వినోద్ నారాయణ్ ఝా మాట్లాడుతూ.. నితీశ్ కుమార్ ఎన్‌డీఏలో చేరితే తాము ఘనంగా స్వాగతం పలుకుతామన్నారు. ఆయనతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. పాశ్వాన్ కూడా అదే విషయాన్ని స్పష్టం చేశారు.
ఆర్‌జేడీ, కాంగ్రెస్‌తో కలిసి ఏర్పాటైన ‘మహాఘట్‌బంధన్’తో నితీశ్ అంత సంతృప్తిగా లేరని పాశ్వాన్ పేర్కొన్నారు. రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ తెరపైకి తెచ్చిన రామ్‌నాథ్ కోవింద్‌కు నితీశ్ కుమార్ మద్దతు ప్రకటించారు. దీంతో ఆయనను ఎన్‌డీఏలో చేరాల్సిందిగా వినోద్ నారాయణ్, పాశ్వాన్ కోరారు. అంతకుముందు బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నిత్యానంద రాయ్ కూడా నితీశ్‌ను ఎన్‌డీఏలోకి ఆహ్వానించారు. కాగా, రామ్‌నాథ్ కోవింద్‌కు మద్దతు ప్రకటించడంపై ఆర్జేడీ చీఫ్ అగ్గిమీద గుగ్గిలం అవుతుండడంపై నితీశ్ మాట్లాడుతూ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ తనకు ఉందన్నారు. అంతేకాదు రాష్ట్రపతి ఎన్నికల్లో రామ్ నాథ్ ను ఓడించేందుకే లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్‌ను ప్రతిపక్షాలు బరిలోకి దించాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.