: 11 ఒప్పందాలపై భారత్, పోర్చుగల్ సంతకాలు
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ, పోర్చుగల్ పర్యటన ముగిసింది. పోర్చుగల్ ప్రధాని ఆంటోనియో కోస్టాతో కీలక చర్చలు జరిపిన మోదీ, మొత్తం 11 ఒప్పందాలను కుదుర్చుకున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, విద్య, యాంటీ టెర్రరిజం, వాతావరణ మార్పులు తదితర అంశాల్లో ఇరు దేశాల మధ్యా ఒప్పందాలు కుదిరినట్టు అధికారులు వెల్లడించారు. శాస్త్ర సాంకేతిక రంగంలో ఇరు దేశాలూ కలసి రీసెర్చ్ నిర్వహించేందుకు నాలుగు మిలియన్ యూరోలతో ఓ సంయుక్త నిధిని నెలకొల్పాలన్న నిర్ణయం తీసుకున్నారు.
దీంతో పాటు ఇరు దేశాల మధ్యా జరిగే వాణిజ్యంపై రెండు పన్నుల రద్దు, నానో టెక్నాలజీ, సాంస్కృతిక బంధాల విస్తరణ, ఆటలు, ఉన్నత విద్య, పోర్చుగల్ - ఇండియా బిజినెస్ హబ్, ఆ దేశంలో ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు తదితర అంశాలపైనా ఒప్పందాలు కుదిరాయి. రెండు దేశాలూ కలిసి మరింత చేయాల్సి వుందని, ముఖ్యంగా వివిధ ప్రాజెక్టులకు మూలధనం అందించడం, మానవ వనరుల అభివృద్ధి, వ్యాపారం పెంపుదల అంశాల్లో మరింత కృషి ద్వారా ద్వైపాక్షిక బంధం బలోపేతమవుతుందని ఈ సందర్భంగా మోదీ వ్యాఖ్యానించారు.