: వైట్ హౌస్ లో మోదీ విందు కోసం ప్రత్యేక చెఫ్ లు!
ఆదివారం ఉదయం వాషింగ్టన్ చేరుకోనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, మరో రికార్డును సొంతం చేసుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఇవ్వనున్న తొలి విందుకు ముఖ్య అతిథి మోదీయే. ఈ విందులో పాల్గొనే ఇరు దేశాధినేతలూ పలు ద్వైపాక్షిక, రక్షణ అంశాలపై చర్చించనున్నారు. ఇక మోదీ రాకకోసం వైట్ హౌస్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోందని ఇప్పటికే వెల్లడించిన అధికారులు, విందు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. పలు రకాల భారతీయ వంటకాలను మోదీ కోసం తయారు చేయించేందుకు ప్రత్యేక చెఫ్ లను నియమించారు.
రేపు మధ్యాహ్నం ట్రంప్, మోదీల మధ్య భేటీ జరగనుండగా, ట్రంప్ అధ్యక్షుడయ్యాక, మోదీ అమెరికా పర్యటనకు వెళ్లడం ఇదే మొదటిసారన్న సంగతి తెలిసిందే. వాణిజ్య సంబంధాలు, పాక్ ప్రేరేపిత ఉగ్రవాదం, వీసా నిబంధనల కఠినతరంపై భారతీయ టెక్ నిపుణులు, కంపెనీల్లో నెలకొన్న భయాందోళనలు తదితర అంశాలపై వీరిద్దరూ కీలక చర్చలు జరపనున్నారు. రెండు దేశాల మధ్యా పలు ఒప్పందాలు కూడా కుదరనున్నాయి.