: క్రికెట్ ఆధారంగా మా జాతీయవాదాన్ని ఎలా కొలుస్తారు?: అసదుద్దీన్ సూటి ప్రశ్న
జమ్మూ కాశ్మీర్‌లో డీఎస్పీ అయూబ్ పండిత్‌ను చంపడంపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ తీవ్రంగా స్పందించారు. రంజాన్ ప్రార్థనల సందర్భంగా మక్కామసీదు ప్రాంగణంలో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. `డీఎస్పీని చంపడాన్ని నేను ఖండిస్తున్నాను. మోదీగారు మీ ప్రభుత్వం, జమ్మూ కాశ్మీర్‌లో మహబూబా ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి?` అని అసదుద్దీన్ ప్రశ్నించారు.
ముస్లింలు, క్రిస్టియన్లను ఈ దేశానికి వచ్చిన గ్రహాంతరవాసులుగా వెల్లడించిన రామ్‌నాథ్ కోవింద్‌ను మీరు రాష్ట్రపతి పదవికి ఎలా నామినేట్ చేశారు, మాకు ఈ దేశంతో సంబంధం లేదా? అంటూ ప్రధాని మోదీని అసదుద్దీన్ నిలదీశారు. అలాగే భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంలో కనిపించే అతిజాతీయవాదంపై మాట్లాడుతూ - `మేం పాకిస్థాన్‌ను వదిలేసి చాలా కాలం అయింది. కానీ ఇప్పటికీ క్రికెట్ మ్యాచ్‌లు వస్తే మా జాతీయతను నిరూపించుకోవాల్సి వస్తోంది. మేం కూడా విరాట్ కోహ్లీ బాగా ఆడాలని కోరుకుంటాం. క్రికెట్ ఆధారంగా మా జాతీయవాదాన్ని ఎలా కొలుస్తారు?` అన్నారు.
గోరక్షణ నెపంతో ముస్లింలపై దాడిచేస్తున్న దందాలు మీకు కనిపించడం లేదా? పక్క దేశాల ఉగ్రదాడులు ట్వీట్ చేసే మీకు, మీ దేశంలో మరణిస్తున్న పెహ్లూ ఖాన్, జాఫర్ ఖాన్‌లు కనిపించడం లేదా? అంటూ సభ ఆద్యంతం ప్రశ్నలు సంధించారు అసదుద్దీన్.