: సైన్ బోర్డుల ద్వారా హిందీని బలవంతంగా రుద్దడంపై కన్నడిగుల ఆగ్రహం
కొద్దిరోజుల క్రితం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రారంభించిన బెంగుళూరు మెట్రో చుట్టూ మాతృభాష వివాదం అలముకుంది. సైన్ బోర్డుల్లో కన్నడ, ఇంగ్లిష్, హిందీ భాషలు ఉపయోగించడంపై విమర్శల వెల్లువ మొదలైంది. ఈ విషయమై వివరణ కోరుతూ కర్ణాటక డెవలప్‌మెంట్ అథారిటీ చైర్‌పర్సన్ ఎస్జీ సిద్ధరామయ్య, బెంగళూరు మెట్రోరైలు కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాశారు.
`కర్ణాటక షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఆస్తుల పైనే మూడు భాషల్లో పేరు రాయాలి. మిగతా వాటి విషయంలో కన్నడ భాషకు ప్రాధాన్యమివ్వాలి. హిందీ అధికార భాషగా ఉన్న ప్రాంతాల్లో మీరు మా భాషను బోర్డుల్లో ఉపయోగించట్లేదు కదా? మరి ఇక్కడ మాత్రం అలా ఎందుకు చేశారు` అని సిద్ధరామయ్య ప్రశ్నించారు.
ఈ లేఖతో బెంగళూరు మెట్రోరైలు కార్పోరేషన్ కేంద్ర ప్రభుత్వానికి చెందినదా? లేక రాష్ట్ర ప్రభుత్వానిదా? అనే ప్రశ్న తలెత్తింది. ఈ విషయంపై కన్నడ భాష మద్ధతువాది వాటల్ నాగరాజు మాట్లాడుతూ -- `నరేంద్ర మోదీ అధికారం చేపట్టిన నాటి నుంచి ఏదో ఒక రూపంలో హిందీ భాషను మాపై రుద్దాలని ప్రయత్నిస్తున్నారు. కర్ణాటక ఉభయ సభల సమావేశంలో గుజరాత్‌లో నరేంద్రమోదీ మంత్రివర్గంలో పనిచేసిన గవర్నర్ వాజూభాయ్ వాలా సభనుద్దేశించి హిందీలో మాట్లాడటమే ఇందుకు నిదర్శనం` అన్నారు.