: నేను పవన్ కల్యాణ్ పార్టీలోకి వెళుతున్నానా... ఏమిటీ రాతలు?: రోజా ఆగ్రహం
తాను సినీనటుడు పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీలోకి జంప్ అవుతున్నట్లు వచ్చిన వార్తలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా మండిపడ్డారు. జనసేననే కాకుండా తాను టీడీపీలోకి వెళుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయని ఆమె అన్నారు. పనికిమాలిన టీడీపీ, జనసేనలోకి వెళ్లే అవసరం తనకేం ఉందని ప్రశ్నించారు. తాను టీడీపీ నుంచి వైసీపీలోకి రాగానే జగన్ తనను ఎమ్మెల్యేని చేశారని రోజా అన్నారు. తనను సంవత్సరం పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయించిన చంద్రబాబు ఎక్కడా? జగన్ ఎక్కడా? అని ఆమె ప్రశ్నించారు. జగన్ తనను తన సోదరి అని చెప్పుకుంటున్నారని, జగన్‌కి తాను జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు.
జీవితాంతం తాను వైసీపీలోనే ఉంటానని రోజా తెలిపారు. తనకు తల్లిదండ్రులు లేరని, తనకు జగనే రక్షణ ఇస్తున్నారని రోజా అన్నారు. ఒకసారి కూడా తనకు ఫోన్ చేసి నిర్ధారించుకోకుండా తాను జనసేనలోకి వెళుతున్నానని రాస్తే ఆ పత్రికలకు గౌరవంగా ఉంటుందా? అని ఆమె ప్రశ్నించారు. భర్తలు తాగి తందనాలాడితే కుటుంబం ఛిన్నాభిన్నం అయిపోతుందని, అటువంటి ఏపీలో తాగుడును మరింత విస్తరించే ప్రయత్నం చేస్తున్నారని రోజా మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలకి అన్యాయం చేస్తే తమ పార్టీ ఊరుకోదని తెలిపారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇప్పుడు జరుగుతున్న అన్యాయాలపై, అక్రమాలపై ఉక్కుపాదం మోపుతామని చెప్పారు.
తాము అధికారంలోకి వచ్చాక మహిళల మాన, ప్రాణాలని కాపాడుతామని రోజా వ్యాఖ్యానించారు. కొన్ని పత్రికలు టీడీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వార్తలు రాస్తున్నాయని మండిపడ్డారు. పనికిమాలిన వారే అటువంటి రాతలు రాస్తున్నారని అన్నారు. గతంలో ప్రత్యేక హోదా కోసం మోదీని జగన్ కలిసి మాట్లాడితే, కేసుల కొట్టివేత కోసం మాట్లాడారని కొన్ని పత్రికల్లో రాశారని మండిపడ్డారు. నిజంగా వాళ్లకి విలువలున్నాయా? అని ప్రశ్నించారు.