: మమతా కులకర్ణికి ప్రొక్లైమ్డ్ అఫెండర్ నోటీసు
ఒకప్పటి బాలీవుడ్ హీరోయిన్ మమతా కులకర్ణికి ముంబైలో థానే క్రైం బ్రాంచి పోలీసులు ప్రొక్లైమ్డ్ అఫెండర్ నోటీసులు జారీ చేశారు. అంతర్జాతీయంగా ఎఫిడ్రిన్ డ్రగ్ సరఫరా విచారణలో భాగంగా మమతా కులకర్ణితో పాటు ఆమె సహచరుడు, డ్రగ్ డీలర్ అయిన విక్కీ గోస్వామికి కూడా నోటీసులు జారీ చేసినట్లు ముఖ్య విచారణాధికారి భరత్ షోల్కే తెలిపారు.
ముంబైలోని వెర్సోసా ప్రాంతంలో స్కైఎన్క్లేవ్లో ఉన్న మమతా నివాసానికి, అలాగే అహ్మదాబాద్‌లోని విక్కీ గృహానికి నోటీసులు అతికించినట్లు షోల్కే చెప్పారు. నోటీసులో చెప్పిన గడువులోగా వాళ్లిద్దరూ థానే పోలీసు స్టేషన్లో హాజరు కాకపోతే కోర్టు ఆదేశం మేరకు వారి ఆస్తులను జప్తు చేస్తామని వివరించారు.
నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ పదార్థాల చట్టం ద్వారా ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు వీరిరువురిని ప్రొక్లైమ్డ్ అఫెండర్లుగా గుర్తించింది. గతేడాది మహారాష్ట్రలో 2వేల కోట్ల రూపాయల విలువగల 18.5 టన్నుల ఎఫిడ్రైన్‌ను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఎఫిడ్రైన్‌ను కెన్యాలోని విక్కీ గోస్వామి మత్తుమందుల తయారీ స్థావరానికి పంపి పబ్బుల్లో ఉపయోగించే మేథంఫెటామీన్ అనే పార్టీ డ్రగ్‌ను తయారుచేస్తున్నట్లు సమాచారం.