: అమెరికా పర్యటనలో మరో ఖ్యాతిని సొంతం చేసుకోనున్న మోదీ!
అమెరికా పర్యటన సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనతను సొంతం చేసుకోనున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత ఇంతవరకు ఏ ఇతర దేశాధినేత కూడా ఆయనతో కలసి వైట్ హౌస్ లో విందు ఆరగించలేదు. ఇప్పుడు ఈ ఘనత మోదీ సొంతం కానుంది. ట్రంప్ తో కలసి వైట్ హౌస్ లో విందు ఆరగించిన తొలి దేశాధినేతగా మోదీ నిలవనున్నారు. అంతేకాదు మోదీ, ట్రంప్ లు ఏకంగా ఐదు గంటల సేపు భేటీ కానున్నారు. ఒక అధినేతతో ట్రంప్ ఇంత సేపు భేటీ కావడం కూడా ఇదే ప్రథమం.
ఈ సందర్భంగా వైట్ హౌస్ అధికార ప్రతినిధులు మాట్లాడుతూ, మోదీకి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనే ఆదేశాలు తమకు అందాయని చెప్పారు. రెడ్ కార్పెట్ తో స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేయాలనే ఆదేశాలు ఉన్నాయని తెలిపారు. ట్రంప్, మోదీల మధ్య ఓ కుటుంబ వాతావరణం తరహాలో చర్చలు జరుగుతాయని చెప్పారు. సోమవారం మధ్యాహ్నం వారిద్దరి భేటీ జరగనుంది.