: సహాయక చర్యలకు వర్షం ఆటంకం.. నీరు లోపలికి వెళ్లకుండా బోరుబావిపై ప్లాస్టిక్ కవర్లు
రంగారెడ్డి జిల్లా చన్వెల్లిలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయిన 14 నెలల చిన్నారి మీనాను బయటకు తీసేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. సమయం గడిచే కొద్ది ఆమె తల్లిదండ్రుల్లో ఆందోళన పెరుగుతోంది. మరోవైపు సహాయక చర్యలకు వర్షం ఆటంకంగా మారుతోంది. ఆ ప్రాంతంలో జల్లులు పడుతుండడంతో ఆ నీరు లోపలికి వెళ్లకుండా బోరుబావిపై ప్లాస్టిక్ కవర్లు ఉంచారు.
మోటార్ తో చిన్నారిని బయటకు తీసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆ బోరుబావికి సమాంతరంగా మరో బావి తవ్వుతున్నారు. ఆ చిన్నారి 40 అడుగుల లోతులో ఉన్నట్లు అక్కడి సిబ్బంది అంటున్నారు. మంత్రి మహేందర్ రెడ్డి అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఆమెను బయటకు తీసేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమని ఆయన అన్నారు. వర్షం పడుతున్నప్పటికీ సహాయక చర్యలు ఆగబోవని చెప్పారు.