: కుక్కపిల్లపై పోలీసుల కాల్పులు.. గురితప్పి యువకుడికి తాకిన బుల్లెట్లు!
పలువురు పోలీసులు కుక్కపిల్లపై కాల్పులు జరపడానికి ప్రయత్నించగా, గురి తప్పి ఆ బుల్లెట్లు ఓ యువకుడి ఛాతిలోనికి దూసుకెళ్లిన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలోని పామ్ డేల్‌లో చోటుచేసుకుంది. ఆ ప్రాంతంలోని ఓ ఇంట్లో వీధి మొత్తం అదిరిపోయేలా మ్యూజిక్ సిస్టమ్స్ పెట్టి సౌండ్ పెంచేశారు. దీనిపై స్థానికుల నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఈ రోజు తెల్లవారు జామున ఆ ఇంటికి వెళ్లారు. ఇంతలో మూడేళ్ల ఓ కుక్కపిల్ల ఓ పోలీసుని కరిచింది. దీంతో మిగిలిన పోలీసులు ఆగ్రహం తెచ్చుకుని, 'విచారణకు వస్తే మా పైనే కుక్కను వదులుతారా?' అంటూ తమ తుపాకులకు పనిచెప్పారు.
ఆ కుక్క పిల్లను చంపేయాలని భావించి దానిపై కాల్పులు జరపడానికి ప్రయత్నించారు. అయితే, ఆ బుల్లెట్లు ఆ దారిలో వెళ్తున్న 17 ఏళ్ల యువకుడు అర్మాండో గార్సికా మూరోకి తాకడంతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై స్పందించిన అక్కడి అధికారులు తమ తోటి సిబ్బందిపై కుక్కను వదలడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని అన్నారు. ఆ కుక్క యజమాని మాట్లాడుతూ.... తన ఇంట్లో తమకు ఇష్టం వచ్చిన మ్యూజిక్ వింటే తప్పేముందని, కుక్కపిల్లపై కాల్పులు జరుపుతారా? అని మండిపడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.