: త్వరలోనే రజనీకాంత్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటన చేస్తారు: తలైవా స్నేహితుడు ఎస్ గురుమూర్తి ప్రకటన
ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరుల్లో తాను మరోసారి తన అభిమానులతో భేటీ అవుతానని, తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదని చెప్పలేనని తాజాగా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ఎంతో ఆసక్తి కలిగిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రజనీ సన్నిహితుడు, ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి స్పందించారు. ఈ రోజు చెన్నైలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... రజనీకాంత్ త్వరలో రాజకీయాల్లోకి వస్తారని, కొత్త పార్టీ పెడతారని, దీంతో తమిళనాడులోని చిన్న పార్టీలన్నీ మాయమైపోతాయని అన్నారు.
రజనీకాంత్ కేంద్రంలో ఎన్డీఏకి మద్దతు తెలుపుతారని కూడా గురుస్వామి చెప్పారు. గురుస్వామి రజినీకాంత్ కి సన్నిహిత మిత్రుడు కావడంతో ఆయన చేసిన ఈ ప్రకటన రజనీ అభిమానులను మరింత సంతోష పెడుతోంది. రజనీ రాజకీయాల్లోకి ప్రవేశించడం ఖాయమయిందని భావిస్తున్నారు. ఇటీవలే రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై ఆయన స్నేహితుడొకరు మాట్లాడుతూ ఈ ఏడాది రజనీకాంత్ మరోసారి అభిమానులతో భేటీ అయి డిసెంబర్ 12న పార్టీ ఆవిర్భావ సభను నిర్వహిస్తారని కూడా చెప్పారు.