: తన వివాహంపై వస్తున్న వార్తలపై స్పందించిన 'జబర్దస్త్' భామ!
వైజాగ్ కు చెందిన కుర్రాడిని పెళ్లాడబోతోందనే వార్తలపై నటి, యాంకర్ రష్మి స్పందించింది. తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలు లేవని ఈ జబర్దస్త్ భామ స్పష్టం చేసింది. తన పని పట్ల తాను చాలా సంతోషంగా ఉన్నానని... పెళ్లి గురించి తాను ఆలోచించడం లేదని చెప్పింది. అయితే ఏదో ఒక రోజు తాను వైజాగ్ లోనే సెటిల్ అవుతానని... వైజాగ్ అంటే తనకు చాలా ఇష్టమని తెలిపింది. తన తల్లిదండ్రులు, బంధువులు అంతా వైజాగ్ లోనే ఉన్నారని చెప్పింది. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా ఆరు నెలలకు ఒకసారి తాను వైజాగ్ కు వెళతానని తెలిపింది.
టీవీ యాంకర్ గా ఉండటం వల్ల సినీ అవకాశాలపై ప్రభావం చూపుతుందేమో అనే ప్రశ్నకు సమాధానంగా... హాలీవుడ్ సూపర్ స్టార్లు కూడా టీవీల్లో, వెబ్ సిరీస్ లలో నటిస్తుంటారని చెప్పింది. పెద్ద సినిమాలు కూడా ప్రమోషన్ కోసం టీవీల వద్దకే రావాల్సి ఉంటుందని చెప్పింది, తాను ఈ రోజు ఈ స్థాయిలో ఉండటానికి టీవీనే కారణమని తెలిపింది. 14 ఏళ్ల కృషి అనంతరం టీవీనే తనకు గుర్తింపును తీసుకొచ్చిందని వెల్లడించింది.