: పెళ్లైన కుర్రాళ్లకు 'వెయిట్' ఎక్కువే!: పరిశోధనలో వెల్లడి!
పెళ్లయ్యాక చాలా మంది కుర్రాళ్లు లావుగా అయిపోతారన్న విషయం తెలిసిందే. ఇదే విషయం పరిశోధనలో కూడా రుజువైంది. పెళ్లైన యువకులు, పెళ్లికాని యువకులపై జరిపిన పరిశోధన ఫలితంగా బ్రిటన్ కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ బాత్ తమ నివేదికలో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. పెళ్లయిన కొత్తలో యువకులు బరువు పెరిగిపోయే అవకాశం ఉందని, వారికి పిల్లలు పుట్టిన కొంత కాలం వరకూ బరువు పెరిగిపోతూనే ఉంటారని అందులో పేర్కొంది. సన్నగా ఉన్నవారు కాస్త బరువు పెరిగినా ఫర్వాలేదు కానీ, అలాగే బరువు పెరుగుతూ వెళ్లిపోతే అనారోగ్యం వస్తుందని తెలిపింది.
తమ పరిశోధనలో భాగంగా పెళ్లైన యువకులు... అదే వయసు ఉండి ఇంకా పెళ్లి చేసుకోని యువకులకు మధ్య బాడీ మాస్ ఇండెక్స్ ను చూశామని పేర్కొంది. వారి మధ్య బాడీ మాస్ ఇండెక్స్ సగటున 1.4 కేజీల వరకూ తేడా ఉందని గుర్తించినట్లు తెలిపింది. పెళ్లికాని యువకులు ఇంటి భోజనాన్ని అధికంగా తీసుకోరు. పెళ్లైన వారు మాత్రం భార్య వండిపెట్టే కమ్మని వంటని కడుపునిండా లాగించేస్తారు. అందుకే ఈ పరిస్థితి నెలకొంటోందని సదరు పరిశోధనలో తేలింది.