: భువనగరిలో సరోగసీ వ్యాపారం... నిరుపేద గిరిజన మహిళలే పెట్టుబడి... షాకింగ్ వాస్తవాలు!
నల్గొండ జిల్లా భువనగరిలోని పద్మజ ఇన్ఫెర్టిలిటీ సెంటర్ సరోగసీ వ్యాపారానికి పాల్పడుతోందన్న టీవీ ఛానెల్స్ కధనాల నేపథ్యంలో వైద్య, ఆరోగ్య శాఖాధికారులు ఆసుపత్రిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో డీఎంహెచ్ఓ తో పాటు ఆర్డీవో ఇతర అధికారులు పాలుపంచుకున్నారు. పద్మజ ఆసుపత్రి ఇన్ ఫెర్టిలిటీ సెంటర్ గా రికార్డుల్లో ఉందని గుర్తించారు. అయితే రికార్డులన్నీ పరిశీలించిన అనంతరం సరోగసీ వ్యాపారం నిర్వహిస్తున్నారా? లేదా? అన్న విషయం వెల్లడి కానుందని వారు చెప్పారు. నిబంధనల ప్రకారం వివాహం జరిగి ఐదేళ్లు పూర్తైన దంపతులు పిల్లలు పుట్టలేదని సంతానసాఫల్య కేంద్రాలను ఆశ్రయించవచ్చని, వారికి సంబంధించిన అండం, శుక్రకణాన్ని బయట ఫలదీకరణం చెందించి, దగ్గరి బంధువుల కడుపులో ప్రవేశపెట్టవచ్చని, దీనికి ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.
అయితే టీవీ ఛానెల్ లో చూపించిన విధంగా ఒక వీధిలోని నాలుగు బిల్డింగులను అద్దెకు తీసుకుని, వందల సంఖ్యలో గిరిజన మహిళలకు లక్ష రెండు లక్షల రూపాయల ఎర చూపి సరోగసీ నిర్వహించడం నేరమని చెప్పారు. కాగా, ఆ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ లో నాలుగు బిల్డింగ్ లలో వందలాది మంది గిరిజన మహిళలు సరోగసీ విధానం ద్వారా బిడ్డలు కనేందుకు ఉన్నారని తేలింది. వారు బయటకు వెళ్లాలన్నా ఆసుపత్రి అనుమతి తీసుకోవాలని తెలుస్తోంది. సరోగసీ విధానంలో పిల్లల్ని కనేందుకు ఒక్కో దంపతుల నుంచి 15 లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని, తర్వాత గర్భం బాడుగకు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ, ఒక్కో పేషంట్ మీద సుమారు పది లక్షల రూపాయలు సంపాదిస్తూ ఇన్ ఫెర్టిలిటీ సెంటర్లు డబ్బులు దండుకుంటున్నాయని వారు చెప్పారు.