: సౌదీ అరేబియా యువరాజుగా మహ్మద్ బిన్ సల్మాన్ పట్టాభిషేకం.. మధ్య ప్రాచ్య దేశాలపై ప్రభావం చూపనుందనే అనుమానాలు!
31 ఏళ్ల తన కుమారుడు మహ్మద్ బిన్ సల్మాన్‌ను సౌదీ అరేబియా యువరాజుగా ప్రకటిస్తూ సౌదీ రాజు సల్మాన్ పట్టాభిషేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. తన 57 ఏళ్ల మేనల్లుడు మహ్మద్ బిన్ నయీఫ్ ను కాదని కుమారుణ్ని యువరాజుగా ప్రకటించడంతో మధ్య ఆసియా రాజకీయాల్లో నూతన ఘట్టం ప్రారంభమైంది.
మహ్మద్ బిన్ సల్మాన్‌కి మద్ధతు పలికే వారు ఆయనను రాజ్యానికి ప్రస్తుతం ఎంతో అవసరమైన మార్పులు తీసుకురాగల గొప్ప వ్యక్తిగా కీర్తిస్తుండగా, వ్యతిరేక వర్గం మాత్రం యువరాజు నిర్లక్ష్య పాలన వల్ల మధ్య ప్రాచ్య దేశాల భవిష్యత్తు భ్రష్టుపట్టే అవకాశం ఉందంటున్నారు. ఏదేమైనా మేనల్లుడిని కాదని కుమారునికి పట్టాభిషేకం చేసిన రాజు ఆలోచన ఆకస్మాత్తుగా తీసుకున్నదైతే కాదు. గతంలో పాలనా వ్యవస్థలో సల్మాన్ చేసిన మార్పుల కారణంగా సౌదీ వాసులు ఈ పరిణామాన్ని ముందే ఊహించారు.
కుటుంబసభ్యుల సమక్షంలో మక్కా వద్ద యువరాజు పట్టాభిషేక మహోత్సవం అంగరంగవైభవంగా జరిగింది. ఈ మధ్య కాలంలో సౌదీ అరేబియాతో సన్నిహితంగా ఉంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సహా ఇతర ప్రపంచ ప్రతినిధులు మహ్మద్ బిన్ సల్మాన్‌కు అభినందనలు తెలియజేశారు.