: అన్నిటికీ సిద్ధపడాలి: కూతురు జాన్వితో శ్రీదేవి
త్వరలో తెరంగేట్రం చేయబోతున్న తన పెద్ద కూతురు జాన్వికి, చిన్నవయస్సులోనే ఇండస్ట్రీకి వచ్చిన నటి శ్రీదేవి సలహాలు, సూచనలు ఇస్తోంది. ఇటీవల రణబీర్ కపూర్, జాన్విలపై వచ్చిన పుకార్లే ఈ సలహాల పరంపరకు నాంది. `తనపై వచ్చిన పుకార్లపై జాన్వి అతిగా ఆలోచిస్తోంది. ఇండస్ట్రీలో మనగలగాలి అంటే ఇలాంటి వాటికి ముందే సన్నద్ధం కావాలి` అని సలహా ఇచ్చినట్లు శ్రీదేవీ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
1975లో `జూలీ` సినిమాతో బాలీవుడ్ రంగప్రవేశం చేసిన శ్రీదేవికి ఇక్కడి లోటుపాట్లు అన్నీ తెలుసు. `ఒకసారి సినీరంగంలోకి రావాలని నిశ్చయించుకున్న తర్వాత కష్టపడి పనిచేయడమే లక్ష్యంగా ఉండాలి తప్ప మిగతా విషయాలను పట్టించుకోకూడదు. నిజానికి ఒక తల్లిగా ముందు జాన్వికి పెళ్లి చేయాలనుకున్నా. కానీ తన ఇష్టాన్ని కాదనలేక నటించేందుకు ఒప్పుకున్నా. ఈ రంగంలో తను మంచిపేరు సంపాదిస్తే మొదట సంతోషించేది నేనే` అని శ్రీదేవి వివరించింది. `మామ్` సినిమా ద్వారా త్వరలో శ్రీదేవి తెరపై సందడి చేయనుంది. ఇప్పటికే ఫ్యాషన్ ట్రెండ్స్ ద్వారా ఇంటర్నెట్ లో జాన్వి అందరికీ సుపరిచితమే.