: రాజకిరీటంపై మాకు ఆశలు లేవు: ప్రిన్స్ హ్యారీ
రాజకుటుంబంలో జన్మించడం వల్ల ఎదుర్కోవాల్సిన సవాళ్ల గురించి బ్రిటన్ యువరాజు హ్యారీ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. నిజానికి తమ కుటుంబంలో ఏ ఒక్కరికీ కూడా రాజకిరీటం ధరించాలనే ఆశ లేదని ఆయన తెలిపారు. ప్రజా శ్రేయస్సు కోసం బ్రిటీష్ రాచరిక వ్యవస్థను ఆధునికీకరించాలనుకుంటున్నట్లు హ్యారీ చెప్పారు.
1997లో తన తల్లి ప్రిన్సెస్ డయానా మరణం తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి కూడా హ్యారీ వివరించారు. `20 ఏళ్ల ప్రాయంలోనే ఒత్తిడిని తట్టుకోలేక మద్యానికి బానిస అయ్యాను. ఆఫ్ఘనిస్థాన్‌లో పనిచేయడం కొంత ఊరట కలిగించినా నాజీలను కలిసినట్లు, లాస్‌వేగాస్ పబ్బులలో పార్టీ చేసుకున్నట్లు ఇంటర్నెట్‌లో వచ్చే చిత్రాలు నన్ను కలవరపరిచేవి` అన్నారు.
అప్పటితో పోలిస్తే ప్రస్తుతం పరిస్థితి చాలా మెరుగుపడిందని, తన సోదరుడు విలియం, అతని భార్య కేథరీన్‌లతో కలిసి రాచరిక వ్యవహారాలను చూసుకుంటున్నట్లు హ్యారీ తెలిపారు. వాటిలో భాగంగా తన తల్లి ఆశయాలైన ఉగ్రవాదాన్ని అరికట్టడం, ఎయిడ్స్ పై పోరాటం, స్వచ్ఛంద కార్యక్రమాల నిర్వహణ వంటివి చేపడుతున్నట్లు వివరించారు. అలాగే తన తల్లి డయానా కోరుకున్నట్లుగా సాధారణ జీవితం గడపడమే తనకు ఇష్టమని హ్యారీ వ్యక్తీకరించారు.