: చెన్నై శిల్క్స్ భవన శిథిలాల్లో 400 కిలోల బంగారం, 2 వేల కిలోల వెండి!
గత నెలాఖరులో భారీ అగ్నిప్రమాదం జరిగిన చెన్నై శిల్క్స్ భవన శిథిలాల్లో 400 కిలోల బంగారం, 2 వేల కిలోల వెండి లభించింది. మే 31న భవనం అగ్నికి ఆహుతి కాగా, దాదాపు రెండు రోజుల పాటు మంటలు అదుపులోకి రాలేదన్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో కోట్లాది రూపాయల విలువైన వస్త్రాలు, నగలు కాలిపోయాయని సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఇక, తమిళనాడు రాష్ట్ర ప్రజా పనుల శాఖ, భవనాన్ని పూర్తిగా కూల్చివేసేందుకు 20 రోజుల పాటు పనులను సాగించింది. శిథిలాలన్నీ తొలగించిన తరువాత, రెండు భారీ లాకర్లు కనిపించగా, వాటిని గుర్తించిన అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో 400 కిలోల బంగారు నగలు, రెండు వేల కిలోల వెండి ఉన్నట్టు ఓ అధికారి తెలిపారు. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ. 120 కోట్లకు పైగానే ఉంటుందని అన్నారు.