: పాప బతికే ఉంది... తీయడానికి అధికారులు శ్రమిస్తున్నారు: మంత్రి మహేందర్ రెడ్డి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీం పట్నం మండలం ఇక్కారెడ్డి గూడెంలో బోరుబావిలో పడిన చిన్నారిని రక్షించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మహేందర్ రెడ్డి తెలిపారు. సంఘటనా స్థలంలో రాత్రి నుంచి సహాయకచర్యలు పర్యవేక్షిస్తున్న ఆయన... బాలిక బోరుబావిలో పడిందని తెలియగానే అక్కడికి చేరుకున్నానని చెప్పారు. వెంటనే రెవెన్యూ, ఇతర సహాయక విభాగాల సహాయం తీసుకున్నామని చెప్పారు.
ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సమాచారం అందించి, రక్షణ చర్యలు ప్రారంభించామని అన్నారు. ముందుగా పాపకు ఆక్సిజన్ అందించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. అలాగే సమాంతరంగా గోతిని తవ్వే ప్రయత్నం ప్రారంభించామని ఆయన చెప్పారు. ఈ లోపు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి లోపలికి కెమెరాను పంపి, పాప ఎంత లోతులో ఉందో నిర్ధారించారని అన్నారు. ఆ తరువాత పాపను తీసేందుకు ప్రత్యేక పరికరాలతో ప్రయత్నాలు ప్రారంభించారని ఆయన చెప్పారు. ప్రస్తుతానికి పాప బతికే ఉందని తెలుస్తోందని, పాప క్షేమంగా రావాలని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నామని ఆయన తెలిపారు.